సాధారణ డయాలసిస్‌ను తట్టుకోలేని వారికి ఆధునిక ప్రాణరక్షక చికిత్స
కరీంనగర్ మెడికవర్ వైద్యుల అవగాహన కార్యక్రమం
మంచిర్యాల, ఆగస్టు 4, ( ఆంజనేయులు న్యూస్ )
ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న, మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్న రోగులకు కంటిన్యూస్ రీనల్ రీప్లేస్‌మెంట్ ట్రీట్‌మెంట్ (సీఆర్ఆర్‌టీ) అత్యాధునిక ప్రాణరక్షక చికిత్సగా మారిందని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సాధారణ డయాలసిస్‌ను తట్టుకోలేని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వైద్యులు మాట్లాడుతూ, తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల్లో మూత్రపిండాల పనితీరు ఒక్కసారిగా దెబ్బతినడం సాధారణమని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో సీఆర్ఆర్‌టీ ద్వారా 24 గంటలపాటు నిరంతరాయంగా, నెమ్మదిగా డయాలసిస్ నిర్వహించడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు, విషతుల్యాలు, అదనపు ద్రవాలు క్రమంగా తొలగిపోతాయని వివరించారు. రోగికి అవసరమైన బీపీ మందులను కొనసాగిస్తూనే చికిత్స అందించవచ్చని చెప్పారు. ఈ విధానం వల్ల గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి కీలక అవయవాలపై అదనపు భారం తగ్గి, అవి తిరిగి సాధారణ స్థితికి చేరుకునే అవకాశాలు మెరుగుపడతాయని వైద్యులు తెలిపారు. బహుళ అవయవాల పనితీరు దెబ్బతిన్న రోగుల చికిత్సలో సీఆర్ఆర్‌టీ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో ఈ అత్యాధునిక యంత్రాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ పలువురు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులను వైద్య బృందం కాపాడగలిగిందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం, నిపుణుల పర్యవేక్షణలో ఆధునిక వైద్య సాంకేతికతను వినియోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని వెల్లడించారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నెఫ్రాలజిస్టు డాక్టర్ రాంచందర్, క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యుడు డాక్టర్ సత్యనారాయణ, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, హరీష్, పబ్బ సిద్దు తదితరులు పాల్గొన్నారు.