Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 9:55 am Posted by : Anjaneyulu Dega

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా గోరింటాకు వేడుక

మంచిర్యాల ఆగస్టు 1, ( ఆంజనేయులు న్యూస్ )

ఆషాఢ మాసంలో మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకునే గోరింటాకు వేడుక భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఫ్యామిలీ ఫ్రెండ్స్ స్వచ్ఛంద సంస్థ మహిళా నాయకులు వాణి, రజిత పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన గోరింటాకు వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ సంప్రదాయాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోరింటాకు భారతీయ మహిళల సౌందర్యానికి ప్రతీక మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు వర్షాకాలంలో వచ్చే కొన్ని చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో దోహదపడుతుందని వివరించారు. అలాగే గోరింటాకు శుభప్రదానికి, సౌభాగ్యానికి, ఆనందానికి ప్రతీకగా భావిస్తారని పేర్కొన్నారు. మహిళలు ఒకేచోట చేరి గోరింటాకు పెట్టుకోవడం ద్వారా పరస్పర ఆప్యాయత, ఐక్యత, స్నేహబంధాలు మరింత బలపడతాయని, మన సంస్కృతి, కుటుంబ విలువలను భావితరాలకు చేరవేసే అందమైన సంప్రదాయం ఇదని అన్నారు. ఇటువంటి వేడుకలు సామాజిక అనుబంధాలను పెంపొందించడంతో పాటు మహిళల్లో ఆత్మీయతను మరింత పెంచుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మౌనిక, అనూష, రాణి, మంజుల, సుధ, స్వప్న, కార్తీక, నాగమణి, రమ్య, సమత, శ్రీతని, సితార, విధాత్రి, అశ్రిత తదితర మహిళలు పాల్గొన్నారు.