ఆగస్టు 1 నుంచి 7 వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు – పోస్టర్లు, కరపత్రాల ఆవిష్కరణ
మంచిర్యాల, జూలై 31, ( ఆంజనేయులు న్యూస్ )
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, మాతా-శిశు సంరక్షణ కేంద్రాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామాల అంగన్‌వాడీ కేంద్రాలు, జాతీయ టీకా కార్యక్రమం నిర్వహించే కేంద్రాల్లో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలను ఆదేశించారు. డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, తల్లిపాలు శిశువుకు అమృతంతో సమానం అని పేర్కొన్నారు. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప మరే ఆహారం లేదా నీరు ఇవ్వకూడదని సూచించారు. తల్లిపాల వల్ల శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు విరేచనాలు, న్యుమోనియా, అలర్జీలు, మధుమేహం వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. అలాగే తల్లి-బిడ్డల మధ్య అనుబంధం, జ్ఞాపకశక్తి, కంటి చూపు, మానసిక వికాసం మెరుగుపడుతాయని చెప్పారు. తల్లులకు కూడా తల్లిపాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల ప్రమాదం తగ్గడం, మధుమేహం, అధిక బరువు, మానసిక ఒత్తిడి తగ్గడం, ప్రసవానంతర రక్తస్రావం తగ్గడం, రక్తహీనత నివారణ, గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి చేరడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. తాత్కాలిక కుటుంబ నియంత్రణ విధానంగా కూడా తల్లిపాలు ఉపయోగపడతాయని తెలిపారు. విజయవంతమైన తల్లిపాల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 10 సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని, గర్భిణులకు ముందుగానే తల్లిపాలపై అవగాహన కల్పించాలని, బిడ్డ కోరిన ప్రతిసారి తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విశ్వేశ్వర్ రెడ్డి, డీపీఓ శ్రీమతి ప్రశాంతి, బసుమతి, సుమన్ తదితరులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.