Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 6:17 am Posted by : Anjaneyulu Dega

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

హైదరాబాద్ జూలై 31, ( ఆంజనేయులు న్యూస్ )

భారాస నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి 12:50 గంటలకు కన్నుమూశారు. ఈ విషయాన్ని సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. ఈ నెల 26న హనుమకొండలో ఆయనకు ఛాతినొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా, కార్డియాక్ అరెస్టుగా వైద్యులు గుర్తించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే ఆక్సిజన్ లోపం కారణంగా మెదడుకు తీవ్ర నష్టం జరగడంతో ఐదు రోజుల పాటు చికిత్స పొందిన ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

సామాన్య కుటుంబం నుంచి:

1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని రైతు కుటుంబంలో జన్మించిన సుదర్శన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2001లో తెరాస (ప్రస్తుత భారాస)లో చేరి నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర ఛైర్మన్‌గా సేవలందించి, 2018లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన మరణం పట్ల రాజకీయ, సామాజిక వర్గాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.