Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 3:12 pm Posted by : Anjaneyulu Dega

ఆల్ఫోర్స్ కళాశాల భవన భద్రతపై తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన

చిన్న వర్షానికే కళాశాలకు సెలవు..!

భవనానికి అనుమతులు లేవనే ఆరోపణలు

మున్సిపల్, టౌన్ ప్లానింగ్, విద్యాశాఖ అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టాలని డిమాండ్

మంచిర్యాల, జూలై 29, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో చిన్నపాటి వర్షానికే వర్షపు నీరు భవనంలోకి చేరడంతో బుధవారం కళాశాల యాజమాన్యం సెలవు ప్రకటించింది. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత భవనంలో కళాశాల కొనసాగుతుండటంతో విద్యార్థుల భద్రతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయని వారు చెబుతున్నారు. బోధన జరుగుతున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ భవనానికి అవసరమైన అనుమతులు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, అలాంటి భవనంలో ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల నిర్వహించడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్, టౌన్ ప్లానింగ్, విద్యాశాఖ అధికారులు వెంటనే భవనానికి సంబంధించిన అనుమతులు, నిర్మాణ భద్రత, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. “ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా..? ముందస్తు తనిఖీలు ఎందుకు నిర్వహించడం లేదు..?” అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖలు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కాగా, భవనానికి అనుమతులు లేవనే ఆరోపణలు, భవన భద్రతపై వ్యక్తమైన సందేహాలు, అధికారులపై వచ్చిన విమర్శలపై ఆల్ఫోర్స్ కళాశాల యాజమాన్యం, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, విద్యాశాఖ అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.