Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 6:28 pm Posted by : Anjaneyulu Dega

ఉపాధ్యాయులు నైపుణ్యాభివృద్ధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

మంచిర్యాల, జూలై 27, ( ఆంజనేయులు న్యూస్ )

ఉపాధ్యాయులకు అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. సోమవారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్లలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన 3 రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమానికి మండల విద్యాధికారి తిరుపతి రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాస స్థాయిని మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం, కార్యాచరణ ఆధారిత బోధన, వినూత్న బోధనా పద్ధతుల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి విద్యార్థిలో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించేలా కృషి చేయాలని తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో జిల్లాలో ఎంపికైన ఫౌండేషన్ పాఠశాలల్లో ఎఫ్.ఎల్.ఎం. కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. పి.జి.ఐ. సూచికలలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతాయుతంగా పని చేయాలని తెలిపారు. 3 రోజులపాటు నిర్వహించే ఈ శిక్షణలో బోధన–అభ్యాస ప్రక్రియను మరింత ప్రభావవంతంగా రూపొందించడం, విద్యార్థులలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించడం, తరగతి గది నిర్వహణలో ఆధునిక విధానాలను అమలు చేయడం వంటి అంశాలపై మాస్టర్ ట్రైనర్లు, నిపుణులు సమగ్ర అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ.ఎం.ఓ. జంబోజు సత్తయ్య, హాజీపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి, ఎంఐఎస్ సిబ్బంది, మాస్టర్ ట్రైనర్లు, ఫౌండేషన్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.