గోవధ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
3.42 లక్షల సంతకాలతో కలెక్టర్‌కు వినతిపత్రం
నిర్మల్, జూలై 27, ( ఆంజనేయులు న్యూస్ )
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గోమాత పరిరక్షణ సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా నిర్మల్ జిల్లాలో సేకరించిన 3.42 లక్షల మంది ప్రజల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని సోమవారం హిందూ సంఘాల నాయకులు, గోభక్తుల ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు సమర్పించింది. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల్లో గోమాతకు విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు. దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని, అలాగే గోవధకు పాల్పడుతున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నిర్మల్ జిల్లా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, 3.42 లక్షల మంది సంతకాల ద్వారా ఉద్యమానికి మద్దతు తెలిపారని వివరించారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే ఈ వినతిపత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి తగిన చర్యలు తీసుకునేలా చూడాలని కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన కలెక్టర్ భవేష్ మిశ్రా, సంబంధిత అధికారులకు నివేదించి తదుపరి చర్యల కోసం పంపిస్తామని తెలిపారు. అదే సమయంలో కలెక్టర్ కార్యాలయం సమీపంలో గోవధ జరుగుతోందని ఆరోపిస్తూ, వెంటనే అడ్డుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో గోభక్తులు, హిందూ సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.