Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 9:53 pm Posted by : Anjaneyulu Dega

బాలికల భద్రతే షీ టీమ్స్ లక్ష్యం

డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్‌ఐ ఉషారాణి

మంచిర్యాల, జూలై 20, ( ఆంజనేయులు న్యూస్ )

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి హాజరై విద్యార్థులకు భద్రత, చట్టాలు, డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఎస్‌ఐ ఉషారాణి మాట్లాడుతూ, బాలికల భద్రతే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో లేదా బయట ఎక్కడైనా వేధింపులు, అసభ్య ప్రవర్తన ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. మహిళలు, బాలికలను వేధించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు చిన్న చిన్న సమస్యలకు ఆవేదన చెందకుండా తమ లక్ష్యంపై దృష్టి పెట్టి చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ మంచి విలువలు, క్రమశిక్షణ పెంపొందేలా చూడాలని కోరారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాన్ని నాశనం చేస్తుందని, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వివరించారు. చెడు స్నేహాలు, వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా డ్రగ్స్‌కు ప్రోత్సహిస్తే వెంటనే పోలీసులకు లేదా ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ కేసులు చట్టరీత్యా తీవ్రమైన నేరమని, అలాంటి కేసుల్లో భవిష్యత్తు దెబ్బతింటుందని, చదువుకునే వయసులో జైలు జీవితం ఎదురైతే జీవిత లక్ష్యాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఎస్‌ఐ ఉషారాణి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.