Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 4:17 pm Posted by : Anjaneyulu Dega

“ఆకతాయిలపై షీ టీం ఉక్కుపాదం.. రాముని చెరువు పార్కులో డెకాయ్ ఆపరేషన్”

“మహిళల భద్రతే మా ప్రాధాన్యం – వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు”
– హైమ, ఎస్‌ఐ, మంచిర్యాల జిల్లా షీ టీం

మంచిర్యాల జులై 14, ( ఆంజనేయులు న్యూస్ )

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ పర్యవేక్షణలో మంగళవారం మంచిర్యాల జిల్లా షీ టీం ప్రత్యేక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. జిల్లా షీ టీం ఎస్‌ఐ హైమ ఆధ్వర్యంలో సిబ్బంది శ్రవణ్, శ్రీలతతో కలిసి పట్టణంలోని రాముని చెరువు పార్కులో ఈ ఆపరేషన్ చేపట్టారు. పార్కుకు వచ్చే యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వెక్కిలి చేష్టలు చేయడం, అసౌకర్యానికి గురిచేయడం వంటి ఫిర్యాదుల నేపథ్యంలో షీ టీం సభ్యులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, వేధింపులకు పాల్పడుతున్న ఐదుగురు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని, ఇటువంటి వేధింపులు, అసభ్య ప్రవర్తన చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజా ప్రదేశాలు, పార్కులు, బస్ స్టాండ్లు, విద్యాసంస్థల పరిసరాల్లో మహిళలు, బాలికల భద్రతకు భంగం కలిగించే వారిపై షీ టీం నిఘా నిరంతరం కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మహిళలు వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే షీ టీం లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ డెకాయ్ ఆపరేషన్‌లో జిల్లా షీ టీం ఎస్‌ఐ హైమతో పాటు సిబ్బంది శ్రవణ్, శ్రీలత పాల్గొన్నారు.