Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 10:34 am Posted by : Anjaneyulu Dega

ఫేక్ డిగ్రీలు.. 3 వేల మంది టీచర్ల తొలగింపు!

బీహార్ జులై 11, ( ఆంజనేయులు న్యూస్ )

బీహార్ లో నకిలీ సర్టిఫికేట్లు, ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా ఉద్యోగాలు పొందిన దాదాపు 3 వేల మంది ఉపాధ్యాయులను విధుల్లోంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2006 నుంచి 2015 మధ్య కాలంలో జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విజిలెన్స్ బ్యూరో సుదీర్ఘ దర్యాప్తు చేపట్టింది. విజిలెన్స్ అధికారులు సమర్పించిన సమగ్ర నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ఈ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. కేవలం ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుండా, సదరు ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే ఈ స్కామ్ తో సంబంధం ఉన్న పలువురిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. తప్పు చేసిన వారెవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు సంపాదించి, ఇన్నేళ్లుగా ప్రభుత్వ ఖజానా నుంచి వారు పొందిన జీతాలు, గౌరవ వేతనాలను పదిలేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకాలం వారు తీసుకున్న వేతన సొమ్ము మొత్తాన్ని వడ్డీతో సహా రికవరీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం విద్యాశాఖతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది.