Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 2:11 pm Posted by : Anjaneyulu Dega

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో డిజిటలైజ్ ప్రక్రియ వేగవంతం చేయాలి

భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ

మంచిర్యాల జూలై 10, ( ఆంజనేయులు న్యూస్ )

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజ్ ప్రక్రియ వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ అన్నారు. శుక్రవారం న్యూ ఢిల్లీ నుండి కార్యదర్శి నవీన్ కుమార్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల జాబితాలో పారదర్శకత ప్రజాస్వామ్య బలోపేతానికి కీలకమని అన్నారు. ప్రతి ఎన్నికకు ముందు ఎన్నికల జాబితాను నవీకరించవలసిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని తెలిపారు. 18 సంవత్సరాల వయసు నుండి అర్హత కలిగిన ప్రతి భారత పౌరుడు, ఆయా నియోజకవర్గంలో సాధారణ నివాసితులు, చట్టపరంగా అనర్హులు కాని వారు ఓటరుగా నమోదు కావచ్చని తెలిపారు. ఇంటింటి సర్వేలు, బూత్ స్థాయి అధికారుల పని తీరు, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, సవరణ ప్రక్రియలను ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మిగిలిన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి ఈ నెల 24 తేదీ నాటికి డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ నిర్ణీత కాల వ్యవధిలో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, దేశ వ్యాప్తంగా గతంలో కూడా పలు మార్లు ప్రత్యేక సవరణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఏ ఒక్క అర్హులైన పౌరుడు ఓటు హక్కు కోల్పోకుండా, అనర్హులు జాబితాలోకి చేరకుండా జిల్లా ఎన్నికల అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారమ్ అందజేసిన ఓటర్లందరినీ ముసాయిదా జాబితాలో చేర్చడం జరుగుతుందని, విచారణ లేకుండా ఏ ఓటరు పేరును జాబితా నుండి తొలగించకూడదని తెలిపారు. దరఖాస్తుదారులకు తగిన విచారణ ద్వారా వారి అర్హతను ధృవీకరించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తుది జాబితా ప్రచురణ తర్వాత ఎవరైనా అసంతృప్తిగా ఉంటే జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సవరణ ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపట్టడం జరుగుతుందని, ఏ పోలింగ్ కేంద్రంలోనూ 1 వేయి 200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ 99.6 శాతం, డిజిటైజేషన్ ప్రక్రియ 21.94 శాతం పూర్తి అయ్యాయని, మిగిలిన ఫారాలు ఈరోజు పంపిణీ పూర్తి చేసి డిజిటైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మ్యాపింగ్ చేసిన డాటా ఆధారంగా ఎన్యుమరేషన్ ఫారాలను సరిచూసుకొని డిజిటైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయడం జరుగుతుందని తెలిపారు.