– గ్రామాల్లోనే పరిష్కరించుకోవాలి.. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి
– పెద్దపల్లి డీసీపీ భూక్య రాంరెడ్డి నాయక్
పెద్దపల్లి జూలై 7, (ఆంజనేయులు న్యూస్)
పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డీసీపీ భూక్య రాంరెడ్డి నాయక్ మాట్లాడుతూ, సివిల్ వ్యవహారాల్లో పోలీసులు జోక్యం చేసుకోరని స్పష్టం చేశారు. భూ, ఆస్తి, కుటుంబ సంబంధిత సివిల్ వివాదాలను ముందుగా గ్రామస్థాయిలో పెద్దల సమక్షంలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించి చట్టపరంగా న్యాయం పొందాలని తెలిపారు. సివిల్ వివాదాలను క్రిమినల్ కేసులుగా భావించి పోలీస్ స్టేషన్లకు రావద్దని, ఇటువంటి వ్యవహారాల్లో పోలీసులు చట్టపరంగా జోక్యం చేసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా పరిధిలోని ధర్మారం మండలంలో సివిల్ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని డీసీపీ తెలిపారు. ప్రజలు చట్టబద్ధమైన మార్గాలను అనుసరించి వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ కె. ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐ ఎం. ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.