Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 4:02 pm Posted by : Anjaneyulu Dega

వేధింపులు సహించవద్దు.. షీ టీమ్స్‌ను ఆశ్రయించండి

బెల్లంపల్లి జెడ్పీహెచ్‌ఎస్ బాలికలకు మహిళా భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన షీ టీమ్ పోలీసులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మహిళలు, బాలికలు ఎటువంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని మంచిర్యాల జిల్లా షీ టీమ్ పోలీసులు పిలుపునిచ్చారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో, జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి ఆధ్వర్యంలో బెల్లంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది మహిళల భద్రత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమరవాణా, ట్రాఫిక్ నియమాలు, టీ-సేఫ్ యాప్ వినియోగం, షీ టీమ్స్ సేవలపై విద్యార్థినులకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచిస్తూ, డయల్-100తో పాటు రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల జిల్లా షీ టీమ్ నంబర్ 8712659385లకు సమాచారం అందించాలని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వేధింపులు, బెదిరింపులు లేదా అనుమానాస్పద సంఘటనలు ఎదురైన వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ కానిస్టేబుళ్లు శ్రవణ్, వనిత, శ్రీలత, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోచయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.