Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 7:15 pm Posted by : Anjaneyulu Dega

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డా. నరేందర్ రాథోడ్ బాధ్యతల స్వీకారం

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో జిల్లాను ముందంజలో నిలపాలి : కలెక్టర్ కుమార్ దీపక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా (డీఎంహెచ్‌వో) డాక్టర్ నరేందర్ రాథోడ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను నిరంతరం సమీక్షిస్తూ, సూచికల ఆధారంగా మెరుగైన ఫలితాలు సాధించి జిల్లాను ఆరోగ్య రంగంలో రాష్ట్రంలో ముందంజలో నిలిపేలా కృషి చేయాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని, వైద్య సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామపంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యుల సహకారంతో ఆరోగ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవల వినియోగంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మాతా-శిశు సంరక్షణ, టీకాల కార్యక్రమం, క్షయవ్యాధి నియంత్రణ, అసంక్రమణ వ్యాధుల నివారణ, జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలులో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డా. సుధాకర్ నాయక్, డా. ప్రసాద్, డా. అనిల్, కార్యాలయ పరిపాలన అధికారి విశ్వేశ్వర్ రెడ్డి, డీపీఓ ప్రశాంతి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, జిల్లా హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి మహ్మద్ రషీద్, అల్లాడి శ్రీనివాస్, నాందేవ్, కాకినాడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.