Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 9:11 pm Posted by : Anjaneyulu Dega

ఆదిలాబాద్ రిమ్స్‌లో లైంగిక వేధింపుల కలకలం

పోలీసులకు ఫిర్యాదు.. నిందితుడి అరెస్ట్

ఘటనపై సీరియస్ అయిన జిల్లా కలెక్టర్.. విచారణకు ఆదేశాలు జారీ

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రిమ్స్ మెడికల్ కళాశాలలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. ఆపరేషన్ థియేటర్‌లో పీజీ వైద్య విద్యార్థినిపై నర్సింగ్ కళాశాలకు చెందిన ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు రెండు రోజుల క్రితం జరిగిన ఘటనపై ఆదివారం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా సీరియస్‌గా స్పందించారు. సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ, బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంటనే విచారణ నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్లు తెలిపారు. రిమ్స్‌లో ఎలాంటి వేధింపులు, అనుచిత ఘటనలు జరిగినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రిమ్స్ వంటి ప్రతిష్టాత్మక వైద్య విద్యాసంస్థలో చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.