Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 5:11 pm Posted by : Anjaneyulu Dega

జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా భారీ అవగాహన ర్యాలీ

డెంగ్యూపై అప్రమత్తం కావాలి: డిఎంహెచ్ఓ డాక్టర్. అనిత

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంచిర్యాల పురపాలక సంస్థ 7వ డివిజన్‌లోని అరుణక్కనగర్‌లో డెంగ్యూపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత, మంచిర్యాల మేయర్ ధరిని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, స్థానిక కార్పొరేటర్ వేల్పుల రవీందర్, రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికెన్‌గునియా వంటి కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పగిలిన పాత్రలు, పాత టైర్లు వంటి వస్తువులను బహిరంగ ప్రదేశాల్లో ఉంచవద్దని తెలిపారు. నీటి ట్యాంకులకు తప్పనిసరిగా మూతలు పెట్టాలని, కూలర్లు, పూల కుండీలలో నీరు నిల్వ కాకుండా వారానికి ఒకసారి శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని కోరారు. “పరిసరాల పరిశుభ్రత – వ్యక్తిగత పరిశుభ్రత”ను ప్రతి ఒక్కరూ పాటించాలని, గ్రామపంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సహకారంతో డెంగ్యూ నివారణ చర్యలు మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి వారం “డ్రై డే” నిర్వహించి దోమల వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. అనంతరం జాతీయ కీటక జనిత వ్యాధుల నివారణలో విశేష సేవలందించిన 15 మంది వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈకార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ వెంకటేష్, అల్లాడి శ్రీనివాస్, నామ్దేవ్, శ్రీనివాస్, సత్యనారాయణ మరియు సీహెచ్‌వోలు కాకిరాల వెంకటేశ్వర్లు, నామ్దేవ్, పుట్ట సత్తయ్య, రవికిరణ్, ఆర్‌ఎస్ పద్మ, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలో ప్రతిరోజు చెత్త సేకరణ, తడి–పొడి చెత్త వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు.