ఇద్దరు నిందితుల అరెస్ట్ – రూ.7.8 లక్షల బంగారం, వెండి వస్తువుల స్వాధీనం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాలలో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ.7.8 లక్షల విలువైన 311 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కిలో వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాశ్ మరియు సీఐలతో కలిసి వివరాలు వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితులు ఆశిష్ శ్రీనివాస్ రెడ్డిమల్ల (26), రెడ్డిమల్ల ఆకాష్ (28)గా గుర్తించారు. వీరు చంద్రపూర్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు.
• దొంగతనం చేసిన వస్తువులు :
నిందితుల వద్ద నుంచి మూడు నల్లపూసల హారాలు, రెండు నెక్లెస్‌లు, 20 ఉంగరాలు, చెవికమ్మలు, మట్టెలు, చైన్లు, బ్రేస్లెట్, బంగారం బిస్కెట్ తదితరాలతో కలిపి మొత్తం 311 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే హారతి, ప్లేట్, పంచపాత్రలు, గిన్నెలు, శంఖం వంటి సుమారు ఒక కిలో వెండి వస్తువులను కూడా రికవరీ చేశారు. ఇందులో భాగంగా 67 గ్రాముల బంగారాన్ని చంద్రపూర్‌లోని ముత్తూట్ ఫిన్‌కార్ప్‌లో తనఖా పెట్టి రూ.6.76 లక్షలు పొందినట్లు, అదనంగా దొంగిలించిన రూ.1.50 లక్షల నగదుతో కలిసి మొత్తం డబ్బును జల్సాలు, బెట్టింగ్‌లకు ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
• కేసు వివరాలు :
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ముదం నాగయ్య (64) గౌతమేశ్వర కాలనీ, మంచిర్యాలలో నివసిస్తున్నారు. ఈ నెల 22న స్వగ్రామానికి వెళ్లి, 23న తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి, బీరువా లాకర్లు తెరచి బంగారం, వెండి, నగదు దొంగిలించబడినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, డీసీపీ, ఏసీపీ మార్గదర్శకత్వంలో ఇన్స్పెక్టర్ ప్రమోద్‌రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, క్లూస్ టీమ్, సీసీఎస్ సాయంతో సాంకేతికంగా విచారణ జరిపి, మంచిర్యాల బస్‌స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులపై మహారాష్ట్రలోని చంద్రపూర్, నాగపూర్ ప్రాంతాల్లో 12కు పైగా కేసులు ఉన్నట్లు తెలిసింది. అక్కడ పోలీసులు త్వరగా పట్టుకుంటారని భావించి, తెలంగాణలో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు.
• ప్రజలకు సూచనలు :
వేసవి సెలవుల్లో స్వగ్రామాలకు లేదా పర్యటనలకు వెళ్లే సమయంలో ఇంట్లో విలువైన ఆభరణాలు, నగదు వదిలిపెట్టకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని మంచిర్యాల పోలీసులు సూచించారు.