Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 10:01 pm Posted by : anjudega

మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత.. ఏసీపీపై ప్రైవేట్ డ్రైవర్ల ఆందోళన

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బస్సులు నడపడానికి వచ్చిన ప్రైవేట్ డ్రైవర్లు డిపో ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, ముఖ్యంగా ఏసీపీ ప్రకాశ్ తమపై దాడి చేశాడని ఆరోపిస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేట్ డ్రైవర్ల కథనం ప్రకారం, సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో తాత్కాలికంగా సేవలు అందించేందుకు తాము ముందుకు వచ్చినట్లు తెలిపారు. అయితే, ఈ సమయంలో ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్లు తమను అడ్డుకునే అవకాశం ఉందని, దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.“మా భద్రతకు హామీ ఎవరు ఇస్తారు?” అనే ప్రశ్నను పోలీసులు అడిగినప్పుడు, ఏసీపీ ప్రకాశ్ ఆగ్రహానికి లోనై ఒక ప్రైవేట్ డ్రైవర్‌పై చేయి చేసుకున్నాడని, అతని ఛాతీపై గుద్ది దూషించాడని ఆరోపించారు. ఈ ఘటనతో అక్కడున్న డ్రైవర్లు ఆగ్రహంతో డిపో ఎదుటే కూర్చుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ, తమపై దాడులు జరిగితే బాధ్యత ఎవరిదో స్పష్టంగా చెప్పాలని, తమ భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఘటన స్థలానికి అదనపు పోలీసు బలగాలను తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నించారు. ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో డిపో పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, డ్రైవర్లు కోరుతున్నారు.