Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 10:06 pm Posted by : Anjaneyulu Dega

మంచిర్యాలలో కె.ఎఫ్.సి లో కుళ్లిన చికెన్ కలకలం

స్పందించని ఫుడ్ ఇన్స్పెక్టర్‌పై ప్రజల ఆగ్రహం

కె.ఎఫ్.సి ఘటనపై తక్షణ చర్యలు కోరుతూ ప్రజల డిమాండ్

జిల్లాకు ఫుడ్ ఇన్స్పెక్టర్ “ఉన్నట్టా లేనట్టా?”

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని కె.ఎఫ్.సి రెస్టారెంట్‌లో కుళ్లిపోయిన చికెన్ విక్రయించారన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనతో పట్టణ ప్రజల్లో ఆహార భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల ప్రకారం, లక్ష్మణ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి కె.ఎఫ్.సి రెస్టారెంట్‌కు వెళ్లి చికెన్ లాలిపాప్ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ అందుకున్న తర్వాత ఆహారాన్ని పరిశీలించిన ఆయన, చికెన్ కుళ్లిపోయినట్లు గుర్తించినట్లు తెలిపారు. అయితే అప్పటికే పిల్లలు కొంత భాగం తినడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా స్పందించినట్లు బాధితుడు ఆరోపించారు. వెంటనే ఆయన 100 నంబర్‌కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్పందించకపోవడం, హోటళ్లలో నియమిత తనిఖీలు జరగకపోవడంపై భోజన ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

“మంచిర్యాలకు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నట్టా, లేనట్టా? ఉన్నా కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టణంలోని హోటళ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నాణ్యత లేని ఆహారం విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉండగా, అధికారుల చర్యలపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.