Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 11:33 am Posted by : Anjaneyulu Dega

కళలు, సంస్కృతిలో మహిళల పాత్ర అపారం

మహిళా దినోత్సవం సందర్భంగా సందేశం ఇచ్చిన శ్రీ నందిని నృత్యాలయం గురువు కల్పన

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్, గురువు కల్పన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ.. మహిళలు తమలోని ప్రతిభను గుర్తించి ధైర్యంగా ముందుకు సాగితే సమాజంలో మార్పుకు మార్గదర్శకులుగా నిలుస్తారని అన్నారు. భారతీయ సాంప్రదాయ కళల అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్య కళలను మహిళలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేస్తున్నారని తెలిపారు. కూచిపూడి నృత్యం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప కళారూపమని చెప్పారు. మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు కళలు, విద్య, సేవా కార్యక్రమాలలో ముందుండి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆమె పేర్కొన్నారు. చిన్నారులకు కూచిపూడి నృత్యాన్ని బోధిస్తూ భారతీయ సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించడం తన లక్ష్యమని గురువు కల్పన తెలిపారు. అలాగే మహిళలు మరియు బాలికలు కళలను నేర్చుకోవడం ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతారని ఆమె తెలిపారు. కళలు ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితంలో ముందుకు సాగేందుకు ప్రేరణ కలిగిస్తాయని చెప్పారు. నృత్యం వంటి కళలు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడి మహిళలు ధైర్యంగా తమ లక్ష్యాలను సాధించడానికి సహాయపడతాయని పేర్కొన్నారు. ప్రతి మహిళ తన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని విద్య, కళలు, వృత్తి రంగాల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, మహిళల సాధికారతతోనే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని గురువు కల్పన అన్నారు.