మంచిర్యాలలో అధికారుల నిర్లక్ష్యం – ప్రజల్లో ఆగ్రహం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్ వద్ద ఉన్న గోదావరి పుష్కర ఘాట్ దుర్వస్థితికి చేరింది. ఘాట్ పరిసరాల్లో చెత్త చెదారం పేరుకుపోవడంతో నీరు కలుషితమై, దుర్వాసన వెదజల్లుతోంది. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, పూజా సామగ్రి అవశేషాలు నీటిలో తేలుతూ కనిపిస్తున్నాయి. పుష్కర ఘాట్ ప్రాంతం ప్రతిరోజూ భక్తులు, స్థానికులు సందర్శించే ప్రదేశం. అయితే పరిశుభ్రత లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దోమల పెరుగుదలతో వ్యాధుల ముప్పు కూడా ఉన్నట్టు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ఘాట్ శుభ్రతపై అధికారులు పట్టించుకోవడం లేదు. వెంటనే చర్యలు తీసుకోవాలి” అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి చెత్తను తొలగించి, ఘాట్ ప్రాంతాన్ని పరిశుభ్రంగా మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.