Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 10:22 pm Posted by : anjudega

బస్ స్టాండ్‌లో దుర్భర పరిస్థితులు

తనిఖీకి దిగిన ఎమ్మెల్యే – ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం

“ప్రతిపాదనలు ఇవ్వండి… నిధులు మంజూరు చేయిస్తా” హామీ”

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్‌నగర్ పట్టణ బస్ స్టాండ్‌లో నెలకొన్న దుర్భర పరిస్థితులపై సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు లేకపోవడం, పారిశుధ్య లోపాలు, దుర్గంధం వెదజల్లుతున్న పరిసరాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్తా కథనాల నేపథ్యంలో సోమవారం ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్‌తో కలిసి ఎమ్మెల్యే బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ ఆవరణ, టాయిలెట్లు, ప్రయాణికుల వేచిచోట్ల పరిస్థితులను పరిశీలించారు. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, శుభ్రత లేమి కనిపించడంతో ఆర్టీసీ అధికారులను నిలదీశారు. “ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బందులు అస్సలు సహించము. వెంటనే పారిశుధ్య పనులు ప్రారంభించాలి” అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బస్టాండ్ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి అందిస్తే, ప్రభుత్వం నుండి అవసరమైన నిధులు మంజూరు చేయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్వర్గీయ పాల్వాయి పురుషోత్తం రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిర్మించిన ఈ బస్టాండ్‌లో ఇప్పటివరకు సరైన మరమ్మత్తులు చేపట్టకపోవడం విచారకరమన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంజనేయులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు..