ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
సమీక్ష సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. మున్సిపల్ పరిధిలోని 60 డివిజన్ల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పరిశుభ్రత నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. “ప్రతి డివిజన్‌ను మన ఇల్లుగా భావించి పనిచేయాలి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని అధికారులను హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులకు అవసరమైన వస్తువులు, యూనిఫాంలు సమయానికి అందజేయాలని కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. పరిశుభ్రత, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల మెరుగుదలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్నీ మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, వివిధ శాఖల అధికారులు, డివిజన్ ఆఫీసర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.