5 ఎకరాల భూమికి బదులు 1 ఎకరానికే నష్టపరిహారం?
న్యాయం చేయాలని కలెక్టర్‌ను ఆశ్రయించిన బాధితుడు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో ఐటీ పార్క్ ఏర్పాటు కోసం చేపట్టిన భూసేకరణలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రైతు మాడుగుల నర్సయ్య జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. తన కుటుంబానికి చెందిన ఐదు ఎకరాలకు పైగా భూమి ఉండగా, కేవలం ఒక ఎకరానికే నష్టపరిహారం చెల్లించారని వాపోయారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, వేంపల్లి గ్రామ రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 159/37లో తమ కుటుంబం దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమి మొత్తం 5 ఎకరాలు 02 గుంటలు ఉందన్నారు. అయితే పాస్‌బుక్‌లో నమోదైన 1 ఎకరం 01 గుంటను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మిగిలిన భూమికి నష్టపరిహారం నిరాకరించారని ఆరోపించారు. భూసేకరణ నోటిఫికేషన్ తమకు వ్యక్తిగతంగా అందలేదని, గ్రామ స్థాయిలో కూడా సరైన సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. కేవలం పత్రిక ప్రకటనతోనే ప్రక్రియ పూర్తి చేయడంతో అభ్యంతరాలు తెలియజేసే అవకాశం కోల్పోయామని తెలిపారు. ప్రాథమిక విచారణ నివేదికలో వాస్తవ స్వాధీనం పక్కనపెట్టి యాంత్రికంగా ఒక ఎకరం మాత్రమే చూపించారని, ఇదే పరిస్థితిలో ఉన్న ఇతర రైతులకు మాత్రం మోకా ఆధారంగా పూర్తి నష్టపరిహారం చెల్లించారని ఆరోపించారు. తన విషయంలో వివక్ష చూపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాన్సెంట్ అవార్డు’ పేరిట భూసేకరణ జరిగిందని చెబుతున్నప్పటికీ, తన నుంచి స్వచ్ఛంద సమ్మతి తీసుకోలేదని, ఒత్తిడితో సంతకాలు సేకరించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన భూమికి కూడా మోకా ప్రకారం పూర్తి నష్టపరిహారం చెల్లించాలని లేదా నిరాకరణకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. జిల్లా స్థాయిలో స్వతంత్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని రైతు విజ్ఞప్తి చేశారు.