Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 1:20 pm Posted by : Anjaneyulu Dega

జీవనశైలి మార్పులతోనే గుండెజబ్బులకు చెక్

మంచిర్యాలలో గుండె ఆరోగ్యంపై అవగాహన సదస్సులో డా. నక్క శ్రీకాంత్ స్పష్టం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మారుతున్న జీవనశైలి కారణంగా గుండె సంబంధిత వ్యాధులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డా. నక్క శ్రీకాంత్ సూచించారు. సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్లో సేవలందిస్తున్న ఆయన, శనివారం పట్టణంలోని నార్త్ ఇన్ హోటల్లో నిర్వహించిన గుండె ఆరోగ్య అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గుండెకు వచ్చే వివిధ రకాల వ్యాధులు, వాటి లక్షణాలు, ప్రమాద కారకాలు, నివారణ మార్గాలపై సవివరంగా వివరించారు. సరైన ఆహార నియమాలు పాటించడం, నిత్య వ్యాయామం చేయడం, పొగతాగడం–మద్యం పూర్తిగా దూరంగా ఉంచడం, మానసిక ఒత్తిడిని నియంత్రించడం వంటి జీవనశైలి మార్పులతో గుండెజబ్బులను చాలా వరకు నివారించవచ్చని స్పష్టం చేశారు. ముఖ్యంగా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సమయానికి చికిత్స పొందవచ్చని సూచించారు. అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నియంత్రణలో ఉంచుకోవాలని చెప్పారు.

అలాగే, మంచిర్యాల ప్రజల సౌకర్యార్థం ఇకపై ప్రతి నెల మొదటి శనివారం, మూడవ శనివారం రోజుల్లో మెడిలైఫ్ హాస్పిటల్లో గుండె సంబంధిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా, యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచిలో సంవత్సరంలో 365 రోజులు, 24/7 ఇంటర్వెన్షన్ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గుండె ఆరోగ్యంపై ఇలాంటి అవగాహన సదస్సులు ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాయని, ఆరోగ్యకర జీవనశైలికి మార్గనిర్దేశం చేస్తాయని కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు సూచించారు.