Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 10:32 pm Posted by : Anjaneyulu Dega

మా ఓట్లు కొనడానికి రాకండి!

డబ్బు, మద్యానికి అమ్ముడుపోని ఓటు – మంచిర్యాలలో ఫ్లెక్సీ సంచలనం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓట్లను కొనుగోలు చేసే రాజకీయ సంస్కృతికి గట్టి చెంపపెట్టు కొట్టినట్టుగా మంచిర్యాల కార్పొరేషన్ 16వ డివిజన్ పరిధిలోని ముల్కల్ల గ్రామానికి చెందిన కొత్తపల్లి శ్రీరామ్ మూర్తి ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. “నా ఇంటిలో మద్యానికి గాని, డబ్బుకి గాని మా ఓట్లు అమ్మబడవు. నాకు దమ్ముంది డబ్బు, మద్యం తీసుకోకుండా ఓటు వేయడానికి… మరి మీకు?” అనే వాక్యాలతో రూపొందించిన ఈ ఫ్లెక్సీ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తోంది. ఎవరైతే అంకితభావంతో పనిచేస్తూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారో అలాంటి వారికి మాత్రమే ఓటు వేస్తానని శ్రీరామ్ మూర్తి స్పష్టం చేశారు. ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ఆయుధమని, దానిని అమ్ముకోవడం దేశ భవిష్యత్తును అమ్ముకున్నట్టేనని ఆయన పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీకి స్థానికంగా విశేష స్పందన లభిస్తోంది. యువతతో పాటు వృద్ధులు కూడా ఈ ఆలోచనను స్వాగతిస్తూ, ఇలాంటి చైతన్యాత్మక సందేశాలు ప్రతి గ్రామంలో రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. డబ్బు, మద్యం రాజకీయాలకు చెక్ పెట్టాలంటే ప్రతి ఓటరు ఇలాంటి ధైర్యసాహసాలు ప్రదర్శించాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.