
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: ప్రకృతి సోయగాలు, అటవీ సంపదకు నిలయమైన కుమురం భీం జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది. 16వ శతాబ్దం వరకు గోండురాజులు పాలించిన ఈ ప్రాంతానికి నాటి చారిత్రక ఆనవాళ్లు చెక్కు చెదరకుండా నేటికీ దర్శనమిస్తున్నాయి. ఆసిఫాబాద్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోని దేవదుర్గం కొండపై రాతికట్టడంలో ఉన్న శివాలయం నాటి శిల్పకళా వైభవానికి ప్రతీక. ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ శివాలయాన్ని తాజాగా హైదరాబాద్ కు చెందిన టీవీ దర్శకుడు దండనాయకుల మానస్ ఆధ్వర్యంలో.. డాక్యుమెంటరీ చిత్రీకరణ బృందం గోండు పూజారి ఆత్రం పాండు, స్థానికుల సహకారంతో దర్శించింది.
• 12వ శతాబ్దపు నిర్మాణ ఆనవాళ్లు:
మహారాష్ట్రలోని చాందా గోండురాజుల సామ్రాజ్య పరిధిలోని ఆసిఫాబాద్ ప్రాంతం 16వ శతాబ్దం వరకు పాలించినట్లు చరిత్ర చెబుతోంది. ఆసిఫాబాద్ లోని అంకమరాజు సమాధి ఇందుకు నిదర్శనం. ఆసిఫాబాద్ లోని బాలేశ్వరాలయం అంకమరాజు పాలనలో ప్రసిద్ధికెక్కిందని చెబుతుంటారు. అదే సమయంలో దేవదుర్గం శివాలయం కూడా ప్రాచుర్యం పొంది ఉంటుందని భావిస్తున్నారు. దేవదుర్గం ప్రాంతాన్ని ఏలిన 12వ శతాబ్దం నాటి రాజు అక్కడ ఒకే రాత్రిలో ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. కాలక్రమంలో అక్కడి ప్రజలు వలసలు వెళ్లడంతో ఆలయాన్ని పట్టించుకునేవారు లేక మరుగునపడి శిథిలావస్థకు చేరినట్లు డాక్యుమెంటరీ దర్శకుడు మానస్ తెలిపారు. ఇక్కడి నుంచి అప్పటి రాజులు మహారాష్ట్రలోని చాంద వరకు సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్న ఆనవాళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు.