Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 11:04 am Posted by : Anjaneyulu Dega

వాహనాల్లో ఓటర్ల తరలింపు నేరం: రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరిక

మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు తావులేదు

2026 నూతన ఎన్నికల నియమావళి విడుదల

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీలు వాహనాల ద్వారా ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తరలించడం చట్ట విరుద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, అవి నేరంగా పరిగణించబడతాయని హెచ్చరించింది. అలాగే ఎన్నికల ప్రచారంలో కుల, మత, భాషా పరమైన విభేదాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ప్రచారం నిర్వహించడం పూర్తిగా నిషేధమని ఎస్‌ఈసీ పేర్కొంది. ప్రజల్లో ద్వేషం లేదా విభజన కలిగించే ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం 2026 నాటి నూతన ఎన్నికల నియమావళిని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నియమావళి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన అభ్యర్థులు, పార్టీలు లేదా వారి అనుచరులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హెచ్చరించింది. స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాలు సహకరించాలని పిలుపునిచ్చింది.