జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం, మంచిర్యాలలో సోమవారం కొత్తగా నియమింపబడిన 71 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిత మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (CHCs) లో ల్యాబ్ టెక్నీషియన్లు తమ విధులను సమయపాలనతో నిర్వర్తించాలని సూచించారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్‌కు పంపే రక్త నమూనాలను సరైన సమయంలో, సరైన మోతాదులో తీసుకుని పంపడంతో పాటు, రోగి వివరాలు, అడ్రస్, మొబైల్ నంబర్ లను రిజిస్టర్లలో మరియు ఆన్లైన్ పోర్టల్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. బార్కోడ్‌ను విభాగాల వారీగా సక్రమంగా నమోదు చేసి, టీ-హబ్‌కు నమూనాలు పంపితే సాయంత్రం వరకు రోగికి మరియు వైద్యునికి వాట్సాప్ ద్వారా పరీక్షా ఫలితాలు అందుతాయని వివరించారు. వైద్యుడు సూచించిన పరీక్షలు మాత్రమే చేయాలని, తద్వారా రోగికి అవసరమైన సరైన చికిత్స అందుతుందని పేర్కొన్నారు.
ల్యాబ్ టెక్నీషియన్లు తమ పరిధిలోనే నివసిస్తూ రిజిస్టర్లను మెయింటైన్ చేయాలని, బయో మెడికల్ వేస్టును నిబంధనల ప్రకారం డిస్పోజ్ చేయాలని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, ఫైలేరియా, గర్భిణీ పరీక్షలకు సంబంధించిన రాపిడ్ డయాగ్నస్టిక్ కిట్లు ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అలాగే అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండాలని, ల్యాబ్ రూములో నిర్వహించే పరీక్షల వివరాలను గోడపై ప్రదర్శించాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణీల పరీక్షలు, సికిల్ సెల్ రక్త నమూనాలు, క్షయ నియంత్రణలో భాగంగా చేయవలసిన పరీక్షలపై కూడా శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, టీ-హబ్ మేనేజర్ వెంకటేష్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ రమేష్, CHOs వెంకటేశ్వర్లు, నామ్దేవ్, సబినిటీ అధికారులు శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి అల్లాడి శ్రీనివాస్, DPHN పద్మ మార్త, అలాగే జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.