ఆసుపత్రిలో ఉద్రిక్తత… సిబ్బంది నిరసన

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జిజిహెచ్ (GGH) క్యాజువాలిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిపై రోగుల బంధువులు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం ఉద్రిక్తంగా మారింది. దాడిని తీవ్రంగా ఖండిస్తూ సెక్యూరిటీ సిబ్బంది, వైద్యులు మరియు ఇతర ఉద్యోగులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి తెలంగాణ మెడికేర్ సర్వీస్ పర్సన్స్ ఆక్ట్ ( Telangana Medicare Service Persons Act ) కింద కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. క్యాజువాలిటీ విభాగంలో నిరంతర పోలీసు బందోబస్తు లేదా టి.ఎస్.ఎస్.పి.ఎఫ్ ఏర్పాటు చేయాలని, ఆసుపత్రి ప్రాంగణంలో సీసీటీవీ నిఘా మరింత పెంచి అనవసర వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై దాడులు చేయడాన్ని సహించబోమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.