జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: కేంద్రీయ విద్యాలయం ద్వారా విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన గుణాత్మక విద్య అందించబడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో గల ప్రధానమంత్రి శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన వార్షిక క్రీడా దినోత్సవం వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాల ద్వారా కుణాత్మక విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల నిర్వహణ కమిటీ ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు జరుగుతూ ఉంటాయని, ఈ నేపథ్యంలో వారి పిల్లలకు విద్యా సంవత్సరంలో ఆటంకం కలగకుండా ఈ విద్యాలయాల ద్వారా విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. భారత ప్రభుత్వం ప్రతి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసి నిర్ణీత సీట్లు కల్పించడం జరిగిందని, సీట్ల ఎంపికలో పూర్తి పారదర్శకంగా లాటరీ పద్ధతిన విద్యార్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలల ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, సంగీతం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళలు, చిత్రలేఖనం ఇతర విభాగాలలో రాణించేలా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. కేంద్రీయ విద్యాలయాలలో విద్యాభ్యాసించిన విద్యార్థులు సమాజంలో అన్ని రంగాలలో రాణిస్తూ అద్భుతాలు సృష్టించగలరని, నాయకత్వ లక్షణాలు అలవడతాయని, కష్టపడి పని చేయడం, టీం వర్క్ అలవాటు అవుతుందని తెలిపారు. ఇతర పాఠశాలలతో పోలిస్తే కేంద్రీయ విద్యాలయంలో విద్యా విధానాలు వేరుగా ఉంటాయని తెలిపారు. విద్యాలయ భవనాలలో పూర్తి సౌకర్యాలు కల్పించబడి, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యా బోధన జరుగుతుందని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే భావితరాలను తీర్చిదిద్దడం జరుగుతుందని, ప్రీ స్కూలింగ్ పద్ధతిని ప్రారంభించడం జరిగిందని, విద్యాలయంలో విద్యార్థుల సంఖ్యను పెంపొందించడం జరిగిందని తెలిపారు. కేంద్రీయ విద్యాలయం విద్యార్థికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, అన్ని రంగాలలో క్రీడా స్ఫూర్తితో ఉండాలని, గెలుపు మాత్రమే కాకుండా అందరితో స్నేహభావంతో కలిసి ముందుకు వెళ్లాలని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం నస్పూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న బాలసదనము భవన నిర్మాణ పనులను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. బాలల సంరక్షణ కొరకు 1 కోటి 34 లక్షల రూపాయల మిషన్ వాత్సల్య నిధులతో భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని, పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో కొనసాగుతున్న ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.