Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 11:08 pm Posted by : Anjaneyulu Dega

ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి దీపక్ తివారి

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, విధులలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి దీపక్ తివారి తెలిపారు. శనివారం జిల్లాలోని కౌటాల మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా తో కలిసి సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, త్రాగునీటి సౌకర్యం, ఇతర సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల మధ్యాహ్న భోజనం సిబ్బందిని, పారిశుద్ధ్య సిబ్బందిని తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, విద్యార్థుల క్రీడా అవసరాల కొరకు తగు ఏర్పాట్లు చేయాలని, పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం, నీటి అవసరాలకు పాఠశాల చేతిపంపు మరమ్మత్తు కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ నెల 28వ తేదీన విధులు నిర్వహించిన ఉపాధ్యాయుల నుండి విధి నిర్వహణలో అలసత్వానికి, సంఘటనకు కారణాలపై వివరణ తీసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. నారాయణ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కౌటాల మండల విద్యాధికారిని ఆరోపణలపై వివరణ కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పాఠశాల తీరును నిర్ధారించుకోవాలని మండల తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు ప్రతిరోజు విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతను పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..