Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 09 October 2025, 1:54 pm Posted by : Anjaneyulu Dega

నడిరోడ్డుపై గేదెలు.. రహదారిలో వెళ్లేదెట్ట..?

ప్రమాదం జరిగితే గాని పట్టించుకోరా.!

చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు

బెల్లంపల్లి చౌరస్తా దగ్గరలో రోడ్డుపై పడుకున్న గేదెలు,

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా దగ్గరలో నడిరోడ్డుపై పడుకున్న గేదెలు.. నిత్యం వందలాది మంది పనుల నిమిత్తం హడావుడిగా వెళుతూ ఉంటారు.. నగర వాసులకు ప్రతి రోజు గేదెలతో ఓ సమస్య వేధిస్తోంది. సరిగ్గా రోడ్డు మధ్యలో పశువులు తిష్టవేసి వచ్చి పోయే వాహనాలకు స్పీడు బ్రేకర్లుగా తయారవుతున్నాయి. వీటిని తప్పించుకు పోవాలంటే ప్రజలకు గగనమవుతోంది. నగర శివారు ప్రాంతంల్లోనో లేక ఏదైనా వీధిలో అయితే పర్వాలేదు. ఏకంగా ప్రధాన కూడళ్లైన ఆర్టీసీ బస్టాండు, మరియు చౌరస్తాలో సర్కిల్ వద్ద రోడ్ల మధ్యలో గంటల తరబడి ఇవి నిలబడడం, పడుకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పశువులు గుంపులు గుంపులుగా రోడ్డుకు అడ్డంగా రావడంతో వాహనాలు తిరగబడి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయని చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువులు రోడ్లపైకి విచ్చలవిడిగా తిరుగుతూ వాహనచోదకులతోపాటు చిరువ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. తోపుడు బండ్లపై ఆకుకూరలు, కూరగాయలు, పలు రకాల పండ్లను తింటూ పాడు చేస్తున్నాయని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

• హెచ్చరికలు సరే.. చర్యలేవీ?

రోడ్డు మీదకు ఆవులు, గేదెలను వదిలితే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాటిని అమలు చేయటంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. రోడ్డు మీదకు వదిలిన పశువులను బందించి అపరాద రుసం వసూలు చేస్తామని, గతంలో హెచ్చరికలు జారీ చేయటంతో కొద్దిరోజుల పాటు మాత్రమే వాటిని బయటకు రానీయకుండా యజమానులు జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో మళ్లీ రోడ్లపైకి వచ్చి యథేచ్చగా తిరుగుతున్నాయి. ఇప్పటికైనా వాటి యజమానులు జాగ్రత్తలు తీసుకునే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కట్టడి చేయాలని నగర ప్రజలు, వాహనచోదకులు కోరుతున్నారు..