
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల నగరపాలక సంస్థలోని అండాలమ్మకాలనీ నివాస గృహాల సమీపంలో తాత్కాలిక చెత్త డంపింగ్ యార్డు నిర్వహిస్తున్నారు. అక్కడ రెండు ఎకరాల స్థలంలో చెత్తను వేస్తుండటంతో గుట్టలుగా పెరిగింది. తరచూ కార్మికులు కాల్చేస్తుండటంతో పొగతో సమీప కాలనీల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ ప్రక్రియ ఎప్పుడో నిలిచిపోయింది. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో శాశ్వత డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. పెరుగుతున్న జనాభా, వెలువడుతున్న చెత్తకు అనుగుణంగా డంపింగ్ యార్డు స్థలాలు ఏర్పాటు చేయడం లేదు. పైగా కుప్పలను కాల్చి ప్రజలను అనారోగ్యాలకు గురి చేస్తున్నారు. పర్యవేక్షణ కరవై ఉన్న స్థలంలోనే చెత్త కొండలుగా పేరుకుపోతోంది. మంచిర్యాలలో నస్పూరు పట్టణం, వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, నర్సింగాపూర్ పంచాయతీలను విలీనం చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కార్పొరేషన్తో పట్టణ పరిధి పెరగడంతో అధికారుల పర్యవేక్షణ లేక వీధిలో చూసినా చెత్తకుప్పలే కనిపిస్తున్నాయి. పట్టణంలో వెలువడే చెత్తను కొంత అండాలమ్మకాలనీకి, మరికొంత నస్పూరు డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. బెల్లంపల్లి పట్టణంలో గతంలో 25 ఆటో ట్రాలీలు కొనుగోలు చేయగా, డ్రైవర్ల కొరత కారణంగా 12 ఆటో ట్రాలీలతో మాత్రమే తరలిస్తున్నారు. మరికొన్ని పురపాలక సంఘాల్లో సిబ్బంది, వాహనాల కొరత ఉంది. తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ జాడే లేదు..