కొలాం గిరిజనుల పిల్లల దుస్థితి

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవాలన్నా.. వైద్యం పొందాలన్నా.. రైతులు ఎరువులు కొనుగోలు చేయాలన్నా.. అంగన్వాడీ కేంద్రంలో చేరాలన్నా.. దేనికైనా ఆధార్ కార్డు అవసరం. అటవీప్రాంతంలో జీవించే కొలాం గిరిజనులలో చాలా మందికి ఈ కార్డులు లేవు. ఫలితంగా వారి పిల్లలు చదువులకు దూరంగా ఉండిపోతున్నారు. జన్మ ధ్రువపత్రాలు లేక ఆధార్ కార్డు పొందలేకపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ గ్రామీణం, ఉట్నూరు, నార్నూరు, గాదిగూడ మండలాలతో పాటు కుమురం భీం జిల్లాలోని జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, కెరమెరి, తిర్యాణి తదితర మండలాల పరిధిలోని కొలాంగూడేలతో పాటు నిర్మల్, మంచిర్యాల జిల్లా కొలాం పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. కుమురం భీమ్ జిల్లా జైనూర్ మండలం గౌరి కొలాంగూడేంతో పాటు లెండిజాల గ్రామాల్లో నివాసముండే కొలాం గిరిజన పిల్లలు 20 మందికి ఆధార్ కార్డులు లేక చదువులకు దూరంగా ఉండిపోయారు. అంగన్వాడీ కేంద్రం లేదా పంచాయతీ నుంచి జన్మ ధ్రువపత్రం జారీ చేసి పిల్లలకు ఆధార్ కార్డులు ఇప్పిస్తే వారికి చదువులకు ఆటంకం రాదని తాజా మాజీ సర్పంచి సిడాం భీంరావు అన్నారు.
ప్రత్యేకంగా ఇప్పించాలి:
– కొడప లక్ష్మణ్ పటేల్, పాటగూడ
ఆధార్ కార్డులు కావాలంటే జన్మ ధ్రువపత్రం అవసరం. కొలాం గిరిజన గర్భిణులు ఇప్పుడు ప్రసూతి కోసం ఆసుపత్రికి వెళ్తున్నారు. గతంలో ఇంటి వద్దే ప్రసవాలు జరిగాయి. వారికి జన్మ ధ్రువపత్రం ఇచ్చే వారు లేరు. పిల్లలు బడికి దూరమవుతున్నారు. మానవతా దృక్పథంతో ఆధార్ కార్డులు ఇప్పించాలి.
ఈ విషయం నా దృష్టికి వచ్చింది
– ప్రవీణ్ కుమార్, తహసీల్దార్, ఇంద్రవెల్లి
ఇంద్రవెల్లి మండలం సమాక పంచాయతీ పాటగూడ(ఇంద్రవెల్లి(కె))లో ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 22 మంది పిల్లలకు ఆధార్ కార్డులు లేవని నా దృష్టికి వచ్చింది. జన్మ ధ్రువపత్రం జారీ చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని జారీ చేస్తాం.