Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 13 May 2025, 10:37 pm Posted by : Anjaneyulu Dega

చెరువు కట్టల సుందరీకరణపై ప్రభుత్వ నిర్లక్ష్యం

అడుగులు పడక.. నిర్లక్ష్యం వీడక

పాత చెరువుల సుందరీకరణ పనుల తీరిది..

రాముని చెరువు కట్ట

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని పాత చెరువులను తీర్చిదిద్దడానికి భారాస ప్రభుత్వ హయాంలో అప్పటి పాలకులు, అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక రాముని చెరువు, పోచమ్మ చెరువు, సాయికుంట చెరువు కట్టలపై పార్కులు ఏర్పాటు  చేయడానికి అప్పుడు రూ.4.60 కోట్ల నిధులను కేటాయించారు. వీటితో ఆ చెరువు కట్టలను వెడల్పుగా నిర్మించి, వాటిపై ఆహ్లాదకరమైన మొక్కలు పెంచి, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ పనులు చేపట్టిన గుత్తేదార్లు నిర్మాణ పనుల్లో జాప్యం చేయడంతో ప్రభుత్వం మారింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెరువు కట్టల సుందరీకరణపై ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా ఆ మూడు చెరువు కట్టలు నిరుపయోగంగా మారాయి.

రాముని చెరువు కట్ట సుందరీకరణకు నాలుగేళ్ల క్రితం రూ.3.50 కోట్ల నిధులు కేటాయించారు. ఆ నిధులతో గుత్తేదారు ఆలస్యంగా పనులు చేపట్టి చెరువు కట్టకు ఒకవైపు బండరాయితో రివిట్మెంట్ చేశారు. కట్టను వెడల్పు చేసి అక్కడక్కడ కొంత భాగం గ్రిల్స్ ఏర్పాటు చేశారు. కాలువ కింది భాగంలో సిమెంట్ కంకరతో పిట్టగోడలు నిర్మించారు. ఆ కట్టపై వాకింగ్ ట్రాక్, బోటింగ్, మొక్కలు పెంచకుండానే వదిలేశారు..

సాయికుంట చెరువు కట్ట సుందరీకరణకు మూడేళ్ల క్రితం పట్టణ ప్రగతి నిధుల నుంచి దాదాపు రూ.60 లక్షలతో పనులు చేపట్టారు. ఆ నిధులతో కట్టకు ఇరుపక్కలా బండరాయితో రివిట్మెంట్ చేసి కట్టపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటుతోపాటు పూల మొక్కలు పెంచి వాకర్స్కు ఆహ్లాదం అందించేలా తీర్చిదిద్దాలి. కానీ ఆ చెరువు కట్ట మాత్రమే వెడల్పు చేశారు. అప్పటికే ప్రభుత్వం మారడంతో పనులు అర్ధంతరంగా వదిలేశారు.

హమాలీవాడలోని పోచమ్మ చెరువు కట్ట సుందరీకరణకు నాలుగేళ్ల క్రితం టీయూఎఫ్ఐడీసీ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించారు. ఆ నిధులతో కట్ట వెడల్పు చేసి చెరువు నీరు నిండే వైపు రక్షణ కోసం ఇనుప కంచె ఏర్పాటు చేశారు. అక్కడ పూల మొక్కలు పెంచి సుందరీకరణ చేపట్టకుండానే గుత్తేదారు పనులు వదిలేశారు.