మామూలు’గా తీసుకుంటున్న ఆరోగ్యశాఖ

ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రి పై ఆరోగ్యశాఖ ఏర్పాటు చేస్తున్న సమావేశాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు.
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రి నిర్వాహకులతో ఆరోగ్యశాఖ ఏర్పాటు చేస్తున్న సమావేశాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. కోతలు తగ్గించాలంటూ ఆదేశాలివ్వడం అధికారులకు అలవాటైతే.. పెడచెవిన పెట్టడం ఆ వైద్యులకు పరిపాటిగా మారింది. ప్రైవేటులో జరుగుతున్న కోతల్లో ఏ మాత్రం మార్పు రాకపోగా మరింత పెరుగుతున్నాయి. ఈ శస్త్రచికిత్సలన్నీ జిల్లాలోని ఆరు ఎదు ఆసుపత్రుల్లోనే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినా వైద్యశాఖ చాలా ‘మామూలు’గా తీసుకుంటోంది. భారీగా శస్త్రచికిత్సలు జరుగుతున్నా కనీసం ఆరా కూడా తీయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రైవేటు కేంద్రాల్లో కోతల తీరుకు ఈ లెక్కలే నిదర్శనం. 90శాతానికి పైగా శస్త్రచికిత్సలతోనే ప్రసవాలు చేస్తున్నట్లు వీటితో తెలుస్తోంది. ప్రతినెల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఈ ప్రసవాల్లో అధికంగా మంచిర్యాలలోని 4-5 ఆసుపత్రుల్లోనే జరుగుతుండగా చెన్నూరులోని ఒక చోట ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. అయినా ఆరోగ్యశాఖ అధికారులు వాటిపై ఎలాంటి చర్యలు లేవు. శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరంపై ఆరా తీసే ప్రయత్నమూ చేయడం లేదు.
• ఫీజుల్లో ఏమాత్రం తగ్గడం లేదు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవమైనా.. శస్త్రచికిత్స ద్వారా చేసినా ఫీజుల్లో ఏ మాత్రం తగ్గడం లేదు. కానీ వైద్యులు సమయం ఆదా చేసుకునేందుకు, పని సులువుగా పూర్తి చేసేందుకు కోతలకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. గంటల తరబడి ఎదురుచూడలేక.. ఓపిక పట్టడం చేతకాక అయిదు నిమిషాల్లో పూర్తయ్యే శస్త్రచికిత్సలకు అలవాటుపడిపోతున్నారు. ఫీజులు ఎలాగూ తగ్గించడం లేదు. బాధితులకు సాధారణ ప్రసవాలతో కలిగే లాభాలను వివరించి వీటికే మొగ్గుచూపేలా చొరవచూపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శస్త్రచికిత్సలు బాలింతల భవిష్యత్తు ఆరోగ్యంపై ఏ స్థాయిలో ప్రభావితం చేస్తాయో తెలిపేలా ఆరోగ్యశాఖ అవగాహన పెంచడంతోపాటు ప్రైవేటులో కోతలను తగ్గించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.