Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 18 June 2024, 10:30 pm Posted by : anjudega

ప్రైవేట్’ దోపిడి

దుస్తులు, పుస్తకాల పేరిట ప్రైవేటు బడుల్లో వసూళ్లు

చూసి చూడనట్లు పట్టించుకోని సంబంధిత అధికారులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఇది కేవలం ఒక పాఠశాలకు సంబంధించిన అంశం కాదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో దుస్తులు, పుస్తకాలు, ట్యూషన్, బస్సు ఫీజులు, బూట్లు తదితరాల ధరలు అమాంతం పెంచేసి అందినకాడికి దండుకుంటున్నారు. బయట మార్కెట్లో కొనుగోలు చేస్తామంటే కుదరదని నిబంధనలు పెడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ఆవరణలో ఎట్టి పరిస్థితుల్లో పుస్తకాలు, ఏకరూప దుస్తులు విక్రయించొద్దని స్పష్టం చేసింది. జిల్లా అధికారులు సైతం ప్రకటనలు విడుదల చేశారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి మార్పు లేదని సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

• పుస్తకాల పేరిట ధరల్లో భారీగా తేడాలు.

బయట మార్కెట్లో దొరికే వస్తువుల ధరలకు పాఠశాలల్లో లభించే వాటికి వ్యత్యాసం భారీగా ఉంటోంది. నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు పుస్తకాలు, టై, బెల్టులు, బూట్లు, ఏకరూప దుస్తులు, బ్యాడ్జీలు, గుర్తింపు కార్డులు, బ్యాగులు, కవర్లు, పెన్నులు, పెన్సిళ్లు తదితర సామగ్రి కొనుగోలుకు రూ.4,500 నుంచి రూ.13 వేల వరకు ఖర్చవుతోంది. కొన్ని పాఠశాలల్లోనే విక్రయాలు జరుపుతుండగా మరికొన్ని చోట్ల ప్రత్యేక విక్రయశాలలు, పుస్తక విక్రయ కేంద్రాలతో ఒప్పందం చేసుకొని వ్యాపారం కొనసాగిస్తున్నారు.

• అడ్డగోలుగా రూ. వేలల్లో ఫీజులు వసూలు.

ఏకరూప, ప్రత్యేక వారాల్లో వేసే దుస్తులు మొదలైన సామగ్రికి అడ్డగోలుగా రూ.వేలు వసూలు చేస్తున్నారు. ఒక్కో పాఠశాలకు ధరల్లో రూ.500 నుంచి రూ.4,000 వరకు వ్యత్యాసం ఉంటోంది. ప్రైవేటు పాఠశాలల్లో విక్రయించే పాఠ్యపుస్తకాలు ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రాథమిక స్థాయితో పోల్చుకుంటే ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఖర్చు కాస్త తక్కువగా అవుతోంది. ప్రాథమికోన్నత స్థాయిలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను తప్పనిసరి చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ తరగతుల వారికి ఐఐటీ, నీట్ తరగతుల పేరుతో మరింత దండుకుంటున్నారు. నిజానికి ఆరో తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాల పుస్తకాలనే బోధించాలి. కానీ ఏడో తరగతి వరకు పాఠశాలకు సంబంధించిన సిలబస్తోనే తరగతులు కొనసాగిస్తున్నారు.

• జీవొని నం.1 ని పట్టించుకోని ప్రైవేట్ పాఠశాలలు

విద్యాశాఖలో జీవో నం.1కి ప్రాముఖ్యం ఉంది. ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, దుస్తులు, ఇతర సామగ్రి విక్రయాలపై స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. బహిరంగ మార్కెటులో దొరికే పుస్తకాలు అమ్మాలని.. దుస్తులు, ఇతర సామగ్రి అమ్మరాదని స్పష్టమైన నిబంధనలున్నాయి. ఒకవేళ పుస్తకాలు అమ్మితే బహిరంగ మార్కెటు కంటే ఎక్కువ ధరకు ఎట్టి పరిస్థితులలోనూ విక్రయించవద్దని ఉత్తర్వు చెబుతోంది. ఐతే ఈ జీవోకు ప్రైవేటు పాఠశాలలు తిలోదకాలిచ్చాయి. బయటి మార్కెట్లో దొరకని పుస్తకాలు, ఇతర సామగ్రిని ఎంచుకొని దోపిడీకి పాల్పడుతున్నాయి.