Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 12 June 2024, 10:08 pm Posted by : Anjaneyulu Dega

మనిషి జీవితంలో గొప్ప మార్పుకు చదువే ప్రధానం

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మనిషి జీవితంలో గొప్ప మార్పుకు చదువు మాత్రమే ప్రధానమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. 2024-25 విద్యా సంవత్సరం పాఠశాలల పున:ప్రారంభంలో భాగంగా బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్ల, రాపల్లి గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ లతో కలిసి విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందనని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు నిష్ణాతులై, అనుభవజ్ఞులై ఉంటారని, విద్యార్థులు చదువులో రాణించేందుకు తల్లిదండ్రులు తమ వంతు ప్రోత్సాహం అందించాలని తెలిపారు. నేటి సమాజంలో అన్ని రంగాలలో ఉన్నత స్థానాలలో నిలిచిన ఎంతో మంది ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఇంజనీర్స్, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించిన వారేనని, ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పూర్తి స్థాయిలో సాధించాలని తెలిపారు. విద్యార్థులకు పాఠశాలల ప్రారంభం రోజునే ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేయాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరిగిందని, స్వయం సహాయక సంఘాల సహాయంతో దాదాపు 43 వేల ఏకరూప దుస్తుల జతలు తయారు చేయడమే లక్ష్యంగా ప్రతి మండల కేంద్రంలో కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవడం జరిగిందని, పాఠశాలల్లో నెలకొన్న మరమ్మత్తు పనులు, సమస్యలను పరిష్కరించేందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సంబంధిత శాఖల అధికారులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. వేసవి సెలవులకు ముందు, పాఠశాలలు ప్రారంభించిన తరువాత పాఠశాలల్లో జరిగిన అభివృద్ధి పనులు స్పష్టంగా కనపడుతున్నాయని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల శిక్షణలో విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగంలో రాణిస్తూ సమాజంలోని ప్రతి అంశంపై అవగాహన పెంచుకొని సుశిక్షితులవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశిల్దార్ సతీష్, సమగ్ర శిక్ష సమన్వయకర్తలు చౌదరి, శ్రీనివాస్, సత్యనారాయణమూర్తి, జెడ్.పి.టి.సి. శ్రీనివాస్ రావు, ఎం.పి.పి. మందపల్లి స్వర్ణలత, గ్రామ సమైఖ్య సంఘ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.