జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా అభివృద్ధి దిశగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ధాన్యం, పత్తికి మద్దతు ధర అందించడం జరుగుతుందని, పురపాలక సంఘాలు, గ్రామపంచాయతీలలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించడం జరుగుతుందని తెలిపారు. మార్కెఫెడ్ ద్వారా కూరగాయలు, పూలతోటల పెంపకానికి అవసరమైన ఎరువులను సొసైటీల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని, అంతర పంటల సాగుపై రైతుల కొరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గొర్రెల పంపిణీ పథకంలో డి.డి.లు కట్టిన వారికి ప్రభుత్వ పాలసీ ప్రకారం యూనిట్స్ కాని, నగదు కాని ఇవ్వడం జరుగుతుందని, ఉద్యానవన శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో ఆయిల్పామ్ సాగుతో పాటు ఇతర ఉద్యానవన పంటల సాగుపై తీసుకోవలసిన జాగ్రత్తలు, మెళకువలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులు ఐ.ఐ.టి., జె.ఈ.ఈ.లలో ఉత్తమ ప్రతిభ కనబర్చడమే కాకుండా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చడంలో ఉపాధ్యాయులు, శిక్షకుల కృషి అభినందనీయమని అన్నారు. వార్షిక పరీక్షలలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేయడం జరుగుతుందని, పాఠశాలల్లో నిర్వహించే కార్యక్రమాలకు పేరెంట్ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించడం జరుగుతుందని తెలిపారు. నీటి పారుదల శాఖ ద్వారా జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు క్రింద పూర్తి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియలో అవసరమైన గన్నీ సంచులను అందుబాటులో ఉంచడంతో పాటు రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన, చేస్తున్న లే-అవుట్లపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వివిధ అంశాలపై ప్రజాపరిషత్ సభ్యులు తెలిపిన వివరాలను పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.