జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో గర్భం దాల్చిన ప్రతి మహిళ ప్రసవం ఆసుపత్రిలోనే జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా|| జి.సి. సుబ్బారాయుడుతో కలిసి జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యాధికారులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల పర్యవేక్షకులు, మాతా శిశు ఆసుపత్రి వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, ఫేస్ యాప్ హాజరును ఖచ్చితంగా నమోదు చేయాలని, ఉదయం సమయంలో తప్పనిసరిగా ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందించిన తరువాత వారి పరిధిలోని గ్రామాలను సందర్శించాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గర్భం దాల్చిన ప్రతి మహిళ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించాలని, సమయానుసారంగా గర్భిణులకు నిర్వహించవలసిన వైద్య పరీక్షలను ఖచ్చితంగా చేయాలని, 3వ, 4వ పరీక్షలను మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గైనకాలజిస్టుల ద్వారా చేయించాలని తెలిపారు. ప్రతి గర్భిణి వివరాలను పరిశీలించడం జరుగుతుందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలోని గర్భిణుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, నమోదు కాని వారి వివరాలను సేకరించాలని, ఈ ప్రక్రియలో సూపర్వైజర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఆశ, ఆరోగ్య కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ తమ పరిధిలోని గర్భిణుల వివరాలను 100 శాతం నమోదు చేయాలని, ఎలాంటి సమస్య తలెత్తినా వ్రాత పూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు. “సాధారణ ప్రసవాలు ముద్దు – సిజేరియన్లు వద్దు, ముహూర్తపు ప్రసవాలు వద్దు” అనే నినాదంతో మహిళల్లో అవగాహన కల్పించాలని, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో సిజేరియన్ ప్రసవాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వైద్యాధికారులు, వైద్యులు సాధారణ ప్రసవాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలలో అవగాహన కల్పించాలని, గర్భిణులకు ఆత్మస్థైర్యం, నమ్మకం కలిగించాలని తెలిపారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలిపారు. విధుల పట్ల అలసత్వం, నిర్లక్ష్యం వహించి లక్ష్యాలను పూర్తి చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు హరిశ్చంద్రారెడ్డి, ఆర్.ఎం.ఓ. డా॥ భీష్మ, మాతా శిశు ఆసుపత్రి ఇన్చార్జ్ డా|| వేదవ్యాస్, ప్రోగ్రామ్ అధికారులు, వైద్యాధికారులు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.