Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 10 November 2023, 6:44 pm Posted by : Anjaneyulu Dega

నామినేషన్ల ప్రక్రియను పకడ్బంధీగా నిర్వహించాలి

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియను పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని 004-మంచిర్యాల రిటర్నింగ్ అధికారి, మంచిర్యాల రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని డి.సి.పి. సుధీర్ రామ్నాథ్ కేకన్, ఎ.సి.పి. తిరుపతిరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ శాసనసభ నియోజకవర్గ ఎన్నికలలో భాగంగా ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదల జరిగి ఈ నెల 10వ తేదీ వరకు రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులను నామినేషన్లను స్వీకరించడం జరిగిందని, ఈ క్రమంలో దాఖలైన నామినేషన్లను ఈ నెల 13న పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్లను భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు స్వీకరించడం జరిగిందని తెలిపారు. విధులు కేటాయించబడిన అధికారులు తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించినట్లయితే ఎన్నికల నియమ, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 15న అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ, 30వ తేదీన పోలింగ్, డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని, ఎన్నికల నిబంధనలు డిసెంబర్ 5వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.