
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్, మీర్‌పేట్: ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని కాలేజీ యాజమాన్యం పెట్టిన ఒత్తిడిని తట్టుకోలేక ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మీర్‌పేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఓం సాయినగర్ కాలనీకి చెందిన కృష్ణవేణి, ఆనంద్ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఎం.వైభవ్(16) నారాయణ కాలేజ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండవ కుమారుడు 7వ తరగతి చదువుతున్నాడు. వైభవ్ 10వ తరగతిలోను 8.3 మార్కులు తెచ్చుకున్నాడు. ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్న కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్‌రాసి మంగళవారం ఉదయం 6.30 గంటలకు వైభవ్ చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాసేపటికే గమనించిన కుటుంబ సభ్యులకు వైభవ్ ఆత్మహత్య చేసుకొని ఉండడం కనిపించింది. కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుకున్న మీర్పేట్పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నారాయణ కాలేజ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు కూడా తరలించమని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఈ కేసును మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
• సూసైడ్ నోట్‌లో ఏం ఉందంటే..
వైభవ్ అనే నేను చైతన్యపురిలోని నారాయణ కాలేజ్‌లో చదువుతున్నాను. ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని కళాశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌లు నన్ను టార్చర్ పెడుతున్నారు. నా సోదరుడిని ఎట్టిపరిస్థితుల్లోను నారాయణ కాలేజ్‌లో చేర్చొద్దు. నా జీవితంలో ఇదే చివరి రోజు. విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేయకండి.. నా సోదరుడు మంచి కాలేజ్‌లో చేర్పిస్తారని నేను ఆశిస్తున్నాను. అతని భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. సారీ మమ్మీ, డాడి, సోదరా… సారీ టు ఆల్ అని ఆంగ్లభాషలో సూసైడ్లెటర్ రాశాడు. ఇక, ఇంటర్మీడియట్ ఫస్ట్ఇయర్ విద్యార్థి ఆత్మహ్యతకు పాల్పడిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనంగా మారింది.