Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 27 October 2023, 7:50 am Posted by : Anjaneyulu Dega

ఎన్నికల సంబంధిత ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలి.

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో జరుగనున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, మీడియా సెంటర్, కంట్రోల్ రూమ్, సోషల్ మీడియా సెంటర్లను డి.సి.పి. సుధీర్ రామ్నాథ్ కేకన్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలలో భాగంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రకటనల కొరకు చేసుకున్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి ఎన్నికల నిబంధనలకు లోబడి అనుమతించాలని తెలిపారు. ప్రతి రోజు పెయిడ్ న్యూస్, ప్రకటనల సంబంధిత వివరాలను పర్యవేక్షించాలని, నిర్ణీత నమూనాలో జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించాలని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన, ఇతర ఎన్నికల సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, 1950, సి-విజిల్తో పాటు ఆఫ్లైన్లో అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించే విధంగా సంబంధిత అధికారుల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించిన పోస్టులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి, జిల్లా పౌరసంబంధాల అధికారి వై. సంపత్కుమార్, నోడల్ అధికారి వినీత, సోషల్ మీడియా సెంటర్ సూపర్వైజర్, ఈ.డి.ఎం. సునీల్, ఎన్నికల తహశిల్దార్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.