Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 08 October 2023, 1:42 pm Posted by : Anjaneyulu Dega

కోతుల మృతదేహాలు కలకలం

ఆంజనేయులు న్యూస్, పెద్దపెల్లి జిల్లా: మూగజీవాలపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. 35కు పైగా కోతులకు విషం పెట్టి చంపేశారు. వాటి కళేబరాలను ఓ శ్మశానం వద్ద పడేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల స్థానికంగా కోతుల బెడద ఎక్కువైపోయిందని అక్కడి వారు తెలిపారు. మైనింగ్ కారణంగా కొండలు కనుమరుగైపోవడంతో కోతులు గ్రామాలపై పడుతున్నాయని, ఈ క్రమంలోనే ఆగంతుకులు వాటిని విషప్రయోగంతో మట్టుబెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. కోతుల కళేబరాలను చూసి షాకైపోయిన గ్రామస్తులు వెంటనే సర్పంచ్‌కు సమాచారం అందించారు. సర్పంచ్ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, పశువైద్య అధికారి వచ్చి పంచనామా జరిపించారు. సర్పంచ్‌, అటవీశాఖ సిబ్బంది ఫిర్యాదుతో మూగజీవాలను మట్టుపెట్టింది ఎవరో తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల్లో కొందరు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, కోతుల అంత్యక్రియల్లో గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మూగజీవాలకు తుది వీడ్కోలు పలికారు.