జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో 18 సం||లు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 2వ ఓటరు జాబితా సంక్షిప్త పునరీక్షణ కార్యక్రమం-2023లో భాగంగా నూతన ఓటరు నమోదుతో పాటు ఓటరు జాబితాలో మార్పులు, సవరణలు, తొలగింపులకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల ఓటరు నమోదు అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు, ఆయా మండలాల తహశిల్దార్లు సమన్వయంతో దరఖాస్తులను పరిష్కరిస్తారని తెలిపారు. ఈ నెల 2, 3 తేదీలలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ శిబిరాలలో నూతన ఓటరు నమోదు, సవరణలు, మార్పులు, తొలగింపుల కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, జిల్లాలో అక్టోబర్ 1, 2023 నాటికి 18 సం||లు నిండి వయసు అర్హత గల ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులు, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, సంబంధిత 6, 7, 8 దరఖాస్తు ఫారములు బూత్ స్థాయి అధికారుల వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చని, ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నూతన ఓటరు నమోదు కొరకు ఫారం-6, మార్పులు, చేర్పులు, సవరణల కొరకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు అన్ని పోలింగ్ కేంద్రాలలో / బూత్ స్థాయి అధికారులు / సహాయ ఓటరు నమోదు అధికారి / ఓటరు నమోదు అధికారి / జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో, ఉ దయం 10.30 గం||ల నుండి సాయంత్రం 5 గం||ల వరకు టోల్ ఫ్రీ నం. 1950లో సంప్రదించవచ్చని, పటిష్టమైన ఓటరు జాబితా తయారీకి సహకరించాలని తెలిపారు.