Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 18 August 2023, 9:55 am Posted by : Anjaneyulu Dega

ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

ఎల్బీనగర్ ఠాణాలో మహిళపై పోలీసుల దాష్టీకం

అర్ధరాత్రి తీసుకొచ్చి.. లాఠీలతో కొట్టారు.

ఆగస్టు 15న ఘటన.. ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం నాడు అర్ధరాత్రి వేళ ఓ మహిళపై ఇద్దరు పోలీసులు దాష్టీకానికి దిగారు. రాత్రి 11 గంటల తర్వాత ఠాణాకు తీసుకురావడంతో పాటు, లాఠీలతో దారుణంగా కొట్టారు. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఆగస్టు 15 రాత్రి చోటుచేసుకున్న ఈ దారుణం గురించి బాధితురాలు చెప్పడంతో గురువారం వెలుగులోకొచ్చింది. దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రశ్నించినందుకు..

ఆగస్టు 15 రాత్రి 11 గంటల సమయంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా.. ఎల్బీనగర్ చౌరస్తాలో పోలీసులకు ముగ్గురు మహిళలు కనిపించారు. స్థానికంగా ఇబ్బంది కలిగిస్తున్నారంటూ ఠాణాకు తీసుకొచ్చారు. సెక్షన్ 290 కింద కేసు నమోదు చేశారు. వారిలో మీర్ పేటకు చెందిన మహిళ.. తమను ఎందుకు తీసుకొచ్చారని గట్టిగా ప్రశ్నించారు. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు శివశంకర్, సుమలత ఆమెపై లాఠీతో విరుచుకుపడ్డారు. ఆమె ఎడమ మోకాలి పైభాగం పూర్తిగా కమిలింది. అరికాళ్లపై కొట్టడంతో నడవలేని పరిస్థితి. రాత్రంతా స్టేషన్ లో ఉంచి, ఉదయం ఇంటికి పంపించారు. ఈ వ్యవహారంలో రాత్రి విధుల్లో ఉన్న ఎస్సై పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన సూచనతోనే దాడి జరిగినట్లు బాధితురాలు ఆరోపించారు. కేసు నమోదైంది. కమిషనర్ చౌహాన్ విచారణకు ఆదేశించారు.

• రూ.3 లక్షలు లాక్కున్నారు..

నా కూతురు వివాహం కోసం డబ్బులు తీసుకుని వెళ్తుండగా మంగళవారం రాత్రి ఎల్బీనగర్ పోలీసులు అకారణంగా ఠాణాకు తీసుకొచ్చారు. నా దగ్గరున్న రూ.3 లక్షలు లాక్కున్నారు. విచక్షణారహితంగా కొట్టారు” అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళ బంధువులు, కుటుంబసభ్యులు గురువారం ఉదయం ఎల్బీనగర్ పోలీస్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన విషయం తెలుసుకుని ఆందోళన విరమించారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ రాచకొండ కమిషనర్ చౌహాన్ ను ఆదేశించారు. బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు.