మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపుద కలెక్టర్ (రెవెన్యూ) మోతిలాల్తో కలిసి జిల్లా శాఖల అధికారులతో వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉ న్నత పాఠశాల మైదానంలో ఈ నెల 15వ తేదీన చేపట్టనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలిపారు. వివిధ శాఖల పరిధిలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలలో జరిగిన ప్రగతిని తెలియజేసేలా శఖలాలు ఏర్పాటు చేయాలని, అన్ని శాఖల ఆధ్వర్యంలో జరిగిన ప్రగతిపై నివేదిక రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వ శాఖల పరిధిలో చేపట్టిన పథకాల నిర్వహణ, సాధించిన విజయాలను స్టాళ్ళు ఏర్పాటు చేసి ప్రదర్శించాలని, వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు నిర్వహించాలని, వేదిక వద్ద ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించేలా కార్యచరణ రూపొందించాలని తెలిపారు. జిల్లాలో జాతీయ భావం పెంపొందించేలా ఘనంగా వేడుకలు నిర్వహించాలని, జిల్లా ఖ్యాతిని చాటేలా, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.