Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 18 July 2023, 11:06 am Posted by : Anjaneyulu Dega

అర్హులైన రైతులందరికీ రూ.లక్ష రుణమాఫీ

2023-24 బడ్జెట్ లో రూ.6,325 కోట్ల కేటాయింపు

వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2018లో రైతులకు ప్రకటించిన రూ. లక్ష రుణమాఫీ పథకాన్ని అర్హులైన రైతులందరికీ అమలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. రైతుబంధు నిధులను వారి రుణ ఖాతాల్లో జమ చేయొద్దని ఇప్పటికే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ద్వారా అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. సచివాలయంలో సోమవారం వ్యవసాయశాఖపై ఆయన సమీక్షించారు. ‘ఇప్పటి వరకు 5,42,635 మంది రైతులకు చెందిన రూ.1,207 కోట్ల రుణాలను మాఫీ చేశాం. మిగిలిన వారి కోసం 2023-24 బడ్జెట్ లో రూ.6,325 కోట్లు కేటాయించాం. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) ప్రకారమే అన్ని బ్యాంకులు రైతుల ఖాతాలను రెన్యువల్ చేస్తూ రుణాల పంపిణీని కొనసాగించాలని సూచించాం. రైతులకు సకాలంలో రుణాలను మంజూరు చేసి వెన్నుదన్నుగా ఉండాలని నిర్దేశించాం” అని రఘునందన్ రావు తెలిపారు.