జిల్లాలో అనుమతుల్లేకుండా ఇసుక తరలింపు

ఆంజనేయులు న్యూస్, నిర్మల్ జిల్లా: జిల్లాలోని వాగులు, గోదావరి తీర ప్రాంతం ఇసుకాసురులకు కాసుల పంట పండిస్తోంది. కొంతమంది నేతల అండతో ఈ దందా జోరుగా సాగుతోంది. ఎక్కడికక్కడ అనధికార టెండర్లు నిర్వహించి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇసుకను చూసి రూ.5 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు పాటపాడి రవాణా చేస్తుండగా.. మరికొన్ని చోట్ల అధికారులను ప్రసన్నం చేసుకుని రాజకీయ పార్టీ ప్రతినిధులే సూత్రధారులుగా వ్యవహరిస్తూ దర్జాగా తరలిస్తున్నారు. సారంగాపూర్, నిర్మల్ మండలాల్లో ప్రవహించే స్వర్ణవాగు, భైంసా, కుంటాల, లోకేశ్వరం, నర్సాపూర్ (జి) మండలాల్లో ప్రవహించే సుద్ధవాగులో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు.
అనర్థమని తెలిసినా దర్జాగా..
నదులు, వాగుల ప్రాంతాల నుంచి జోరుగా ఇసుక తరలింపు కొనసాగుతుండడంపై ఆయా గ్రామాభివృద్ధి కమిటీలు ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. తమ ఊరు సమీపంలోని వాగునుంచి ఇసుకను తరలించాలంటే ట్రాక్టరుకు ఇంత రుసుము చెల్లించాలని నిర్ణయించి వీటి వసూలు కోసం గ్రామంలోనే అనధికార టెండర్లు వేస్తున్నారు. ఇందులో అధిక ధరకు తీసుకున్న గుత్తేదారు తమ ప్రాంతాల నుంచి ఇసుకను తరలించేందుకు అధికారులకు, ట్రాక్టరు యజమానులకు వారధిలా ఉండి తనపని కొనసాగిస్తున్నారు. ఆయా ప్రాంతాలనుబట్టి ఒక్కో ట్రాక్టరుకు రూ. 100 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. గ్రామ కమిటీలకు ఆదాయం వస్తుందని అనుకున్నా.. భవిష్యత్తులో నీటి ముప్పు ఆ పల్లె ప్రజలే ఎదుర్కోవాల్సి వస్తుంది.
నామమాత్రపు చర్యలతోనే సరి..
జిల్లాలోని గోదావరి నది, స్వర్ణ, సుద్దవాగుల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తుండటంపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా సంబంధిత అధికారులు మాత్రం స్పందించటం లేదు. నామమాత్రపు చర్యలతో సరిపెడుతూ ఇసుక రవాణాకు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాల్టా చట్టం ప్రకారం.. నదులు, వాగుల నుంచి ఇసుక తీయడం చట్టరిత్యా నేరం. నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నా అధికారులు మిన్నకుండిపోవడంగమనార్హం.
నర్సాపూర్(జి) గ్రామ సమీపంలోని సుద్దవాగులోకి వెళ్లడానికి వీలు లేదు. ఇసుకను తీసుకెళ్లడానికి కొంతమంది జేసీబీ సహాయంతో గ్రామ శివారు నుంచి వాగులోపలి వరకు రోడ్డు వేశారు. ఈ మార్గం మీదుగా అనుమతుల్లేకుండా నిత్యం పదుల సంఖ్యల ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్తున్నారు.